Dec 28, 2011

అక్కినేని అన్నపూర్ణ మరణం


CHITRAJ(ఆంద్ర జ్యోతి వార్త)YO(ఆంద్ర జ్యోతి వార్త)THY NEWS»అక్షరాలా అర్ధాంగి... అన్నపూర్ణ

అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణ... ఈ రెండు పేర్లకు విడిపోని, విడదీయలేని దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం ఉంది. అన్నపూర్ణ స్టూడియో పేరు చెప్పగానే అక్కినేని రూపం కళ్ల ముందు ఎలా కదలాడుతుందో, ఏఎన్నార్ పేరు చెప్పగానే అన్నపూర్ణమ్మ అంతరాత్మ అలా వినిపిస్తుంది. అన్నపూర్ణమ్మ అంటే అక్కినేనికి ప్రాణం, ఆయనే ఆవిడకి సర్వస్వం. సుదీర్ఘమైన తన నటజీవితంలో 70 మందికి పైగా కథానాయికలతో అక్కినేని నటించారు. అయితే ఆయనకి ఇష్టమైన నాయిక మాత్రం అన్న పూర్ణమ్మే. ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుందంటారు. కానీ తన విజయాల వెనుక ఇద్దరు మహిళలున్నారని, వాళ్లు తన తల్లి, తన భార్య అని అక్కినేని ఎప్పుడూ చెబుతుంటారు.

ఈ ఆదర్శ దంపతులంటే వారి పిల్లలకే కాదు పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ గౌరవమే. 1949 ఫిబ్రవరి 18న వీరిద్దరి వివాహం జరిగింది. ఈ 62 ఏళ్ల వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు, మనస్పర్థలు తప్ప మరెలాంటి ఒడిదుడుకులు లేకుండా వారి సంసార జీవితం జీవనదిలా సాగిపోయింది.

అక్కినేని జీవితంలో అనేక ఉద్యమాలు సంచలనం కలిగించి సమస్యలైనట్లే ఆయన పెళ్లి విషయంలో కూడా చర్చలు, వాగ్వాదాలు జరిగాయి. పెళ్లి జరిగే సమయానికే ఆయన పెద్ద హీరో. ఎంతో మంది కలల రాకుమారుడు. ఇతరుల అసూయకు గురికాదగినంత పేరు, డబ్బు గడించుకున్నారు. అందుకే ఆయన పెళ్లి చెడగొట్టడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేశారు. కాబోయే మామగారికి ఆకాశరామన్న ఉత్తరాలు కూడా రాశారు.

అక్కినేని అవినీతిపరుడని, వ్యభిచారి అనీ, అటువంటి వ్యక్తిని అల్లుడిగా చేసుకుంటే మీ కూతురి జీవితం నాశనం అవుతుందనీ ఆ ఉత్తరాల సారాంశం. పిల్లనిచ్చే ఏ తండ్రి అయినా ఇటువంటి ఉత్తరాలు చదివి కంగారు పడటం సహజం. అలాగే అక్కినేని కాబోయే మామ కొల్లిపర వెంకటనారాయణగారు కూడా కంగారు పడ్డారు. అయితే 'బాలరాజు' సినిమా చూసిన తరువాత 'నాగేశ్వరరావే నా భర్త' అని ప్రిపేర్ అయిన అన్నపూర్ణ ఆ విషయంలో రాజీకి అవకాశమే లేదని తేల్చి చెప్పేశారు.

అమ్మాయి ఇష్టపడిన తరువాత ఇక చేసేదేముందనుకున్న వెంకటనారాయణ వీరి పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. అక్కినేనిని చిత్రపరిశ్రమకి పరిచయం చేయడమే కాకుండా ఆయన ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన ప్రతిభా ఫిలిమ్స్ అధినేత ఘంటసాల బలరామయ్య అక్కినేని పెళ్లికి కూడా ఎంతో సాయం చేశారు. వరుడుకి కావాల్సిన కొత్త బట్టలనుంచి, వధువుకి అవసరమైన బంగారు నగలూ అవి తనే చెన్నయ్‌లో తయారు చేయించి పెళ్లికి తీసుకెళ్లారు. ఆనాటి చలనచిత్ర ప్రముఖులంతా ఈ పెళ్లికి తరలి వెళ్లారు.

ఆంధ్రదేశంలో ఎందరో ఆడపడుచులు భర్త కావాలని కోరుకొనే యువకుడు తనకు వరుడిగా లభించాడన్న విషయం అన్నపూర్ణకు తెలుసు. పెళ్ళయిన తొలిరోజుల్లో అక్కినేని చాలా బిజీగా ఉండేవారు. ఒక్కోసారి రోజుకు నాలుగు షిఫ్టులు కూడా పనిచేసేవారు. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసిపోయి ఏ అర్ధరాత్రి దాటిన తర్వాతో ఆయన ఇంటికి చేరుకునే వారు. ఏ భార్యకైనా తన భర్త పెందరాళే ఇంటికి రావాలని, తనతో సరదాగా గడపాలని కోరుకోవడం సహజం.

అయినా భర్త పరిస్థితి అర్థం చేసుకుని ఆయనకు ఎంతో సహకరించేవారు అన్నపూర్ణ. తన భర్త పద్ధతుల్లో మార్పు రావాలని తోచినపుడు మౌనంతో, సహనంతో ఆమె సాధించేవారు. భార్య మనసు కష్టపెట్టకూడదని తన సినిమాల సంఖ్య తగ్గించుకుని తీరిక సమయాల్లో ఇంటికే పరిమితమయ్యేవారు అక్కినేని. ప్రతి ఏడాది ఆమెని తీసుకుని హిల్ స్టేషన్స్‌కి వెళ్లేవారు. పిల్లలు పుట్టిన తరువాత విదేశాలకు వెళ్లేవారు.

రొమాంటిక్ హీరోగా అక్కినేనికి పేరుంది. ఆయనతో నటించే హీరోయిన్లతో లింకులు పెట్టి ఆ విషయాలు అన్నపూర్ణ చెవిన వేస్తుండేవారు చాలామంది. ఆమె రియాక్షన్ చూడాలనే వారి సరదా ఎప్పుడూ తీరేది కాదు. ఈ విషయాల్ని అక్కినేనికి చెప్పి నవ్వేసేవారు. అర్థం చేసుకొనే భార్య దొరికినందుకు ఆయన ఎంతో మురిసిపోతుంటారు. 'నా రెండు కళ్లూ అన్నపూర్ణే.

నా గుండె చప్పుడు అన్నపూర్ణ. నేను, ఆమె విడదీయలేని గొప్ప వాక్యంగా మారాం. అన్నపూర్ణ గొప్ప మహిళ. ఉన్నత వ్యక్తితం కలిగిన ఆమె నా భార్య కావడం నాకు దక్కిన అదృష్టం' అని చెప్పేటప్పుడు అక్కినేని కళ్లలో కనిపించే వెలుగుని వర్ణించడం సులభం కాదు.

'ఆడది కోరుకొనే వరాలు రెండే రెండు. చల్లని సంసారం.. చక్కని సంతానం' అంటారు. అన్నపూర్ణమ్మకు ఆ రెండూ అమరాయి. ఆ ఆత్మసంతృప్తితోనే ఆమె కన్నుమూశారు. అయితే తన సహచరిని కోల్పోయిన అక్కినేనిని ఓదార్చడం మాత్రం ఎవరి తరం?

No comments:

Post a Comment