Apr 11, 2012

పిల్లల కోసం సెలవు కోరిన హన్సిక



‘‘ఈ ఒక్కరోజు శెలవు కావాలి..’’ అని ఆర్టిస్టులెవరైనా నిర్మాతను అనుమతి అడిగితే... ఏ పార్టీకో, ఫంక్షన్‌కో వెళ్లాలేమో లేక ఆరోగ్యం బాగాలేదేమో అనుకోవడం సహజం. ఎక్కువగా ఇలాంటి కారాణాలకే తారలు అనుమతి అడుగుతుంటారు. ఇటీవల హన్సిక కూడా నిర్మాతను పర్మిషన్ అడిగారట. కానీ తన కోసం కాదు. ముద్దులొలికే చిన్నారుల కోసం ఆమె షూటింగ్ నుంచి శెలవు తీసుకున్నారట. ఓ తెలుగు చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉన్న హన్సిక చెన్నయ్‌లో ఈరోజు ‘స్పెషల్ చిల్డ్రన్’ కోసం ఒక స్వచ్ఛంద సేవా సంస్థ తలపెట్టిన కార్యక్రమంలో పాల్గొనాలనుకున్నారట.

ఈ సంస్థలో ఉన్న పిల్లలందర్నీ సదురు సంస్థ ప్రత్యేకమైన ట్రైన్‌లో తిరుపతి తీసుకెళ్లాలనుకుందని సమాచారం. తిరుపతి ప్రయాణం అవుతున్న ఈ పిల్లలందరితో కాసేపు గడిపి, వారు ఎక్కిన ట్రైన్ కదిలే వరకు అక్కడే ఉండాలని హన్సిక నిర్ణయించుకున్నారట. అందరికీ ‘హ్యాపీ జర్నీ’ చెప్పడంతో పాటు, ట్రైన్ కనుమరుగయ్యే వరకు ‘టాటా’ చెప్పాలన్నది ఆమె కోరిక. ప్రయాణంలో పిల్లలందరికీ కావల్సిన తినుబండారాలు, పానీయాలు కూడా ఏర్పాటు చేశారట హన్సిక.

మూమూలు పిల్లల్లా వ్యవహరించలేని ఆ ‘స్పెషల్ చిల్డ్రన్’ ఆనందపడే విషయం ఇది. కేవలం వారిని ఆనందపరచడం కోసమే తెలుగు నిర్మాత దగ్గర పర్మిషన్ తీసుకుని హన్సిక చెన్నయ్ వెళ్లారట. ఈ బబ్లీ బ్యూటీ మంచితనానికి ఇది నిదర్శనం. ఆమెలో సేవాగుణం కూడా ఉంది. ఇప్పటికే 20 మంది వీధి పిల్లలను దత్తత తీసుకున్నారు హన్సిక. త్వరలో ఓ వృద్ధాశ్రమం కూడా ఆరంభించాలనుకుంటున్నారు. రీల్ మీద ‘మంచి మనసు’ ఉన్న హీరోయిన్‌గా కనిపించే హన్సిక.. రియల్‌గా కూడా హీరోయినే అనమాట.

No comments:

Post a Comment