" కేటాయించిన బడ్జెట్‌ను మించి దర్శకుడు సినిమాలు తీయకూడదు. బడ్జెట్ ఫెయిల్యూర్ సినిమాల వల్ల ఈ పరిశ్రమ మీద సామాన్యులు నమ్మకాన్ని కోల్పోతున్నారు. డిస్ట్రిబ్యూటర్ల మీద భారం పెరుగుతోంది. ఎవరైనా చిత్ర పరిశ్రమలోకి వెళ్తానంటే వద్దని వారించేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉండాలి. నేను భవిష్యత్తులో ఏ హీరోతో పనిచేసినా అతని మార్కెట్ ఎంతుంటే అంతకుపైసా తక్కువగానే ఖర్చుపెడతాను. కథలను నమ్ముకుంటాను'' అని అంటున్నారు మారుతి. ఇటీవల 'ఈ రోజుల్లో'తో విజయాన్ని చవిచూసిన దర్శకుడీయన. 'చిత్రజ్యోతి'తో ప్రత్యేకంగా ముచ్చటించారు.ఆ విశేషాలు... "నేను పెయింటింగ్స్ వేసేవాడిని. యానిమేషన్ డైరక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు బన్నితో పరిచయం కలిగింది. అప్పటి నుంచి సినిమాల పట్ల ఆసక్తి మొదలైంది. బన్నీవాసుతో కలిసి కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాం. 'ఎ ఫిల్మ్ బై అరవింద్', 'ప్రేమిస్తే' చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించాను. నా ముగ్గురు ఫ్రెండ్స్‌తో కలిసి గుడ్ సినిమా గ్రూప్‌ని ఏర్పాటు చేసి దర్శకత్వం చేయాలనుకున్నాను. ఎం. శివరామిరెడ్డి మా 'ఈరోజుల్లో' చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. 'ఈరోజుల్లో'తో ప్రేక్షకులు మంచి దర్శకుడిననే ముద్ర వేశారు. కొత్తవాళ్ళతో పెద్ద కథలు వర్కవుట్ కావని నా నమ్మకం. అందుకే ప్రయోగాలు చేయదలచుకోలేదు. నా పరిసరాల్లోని అంశాలతోనే కథను సిద్ధం చేసుకున్నాను. వ్యావహారిక శైలినే వాడాను.
ఎక్కడా అశ్లీలత ఉండదు. రియలిస్టిక్‌గా ఫన్ మిస్ కాకుండా కమర్షియల్ సినిమాలు తీయాలన్నది నా ఆసక్తి'' నా టీమ్ "కీరవాణిగారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేసే జీవన్‌బాబు ఈ సినిమాకు సంగీతమిచ్చారు. కెమెరామెన్ ప్రభాకరరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కెనాన్ 5డీతో సినిమా చేశాం. ఈ కెమెరా కొన్ని లైట్లలోనే బాగా ఉంటుంది. అందుకు తగ్గట్టు వాతావరణం అనుకూలించే దాకా వెయిట్ చేసి సినిమా తీశాం. నిర్మాణానంతర పనులకు కూడా నేను ఎక్కువ సమయం తీసుకున్నాను. ఈ చిత్రాన్ని కన్నడలో ఆల్రెడీ రీమేక్ చేస్తున్నారు. తమిళంలో రీమేక్ చేయడానికి అడుగుతున్నారు. వాస్తవానికి దగ్గరగా ఉన్న చిత్రాలను మనం ఎప్పుడూ పొరుగు భాషల్లోనే చూస్తుంటాం. అలాంటి సినిమాలను మనం తీసినా జనాలు చూస్తారన్న నమ్మకాన్ని 'ఈరోజుల్లో' కలిగించింది.''
తదుపరి "బెల్లంకొండ సురేష్ సంస్థలో తదుపరి చిత్రం చేస్తున్నా. గుడ్ సినిమా గ్రూప్ పతాకంపై కొత్త దర్శకులతో మంచి కథలను తెరకెక్కించాలనుకుంటున్నాం.
No comments:
Post a Comment