Apr 10, 2012

ముగ్గురు దళపతులకు పిలుపు


20న హాజరుకావాలని స్థాయీ సంఘం ఆదేశం

న్యూఢిల్లీ: రక్షణ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘం త్రివిధ దళాధిపతులకు మంగళవారం పిలుపు పంపింది. త్రివిధ దళాలకు చెందిన బలగాల సన్నద్ధతపై వివరణ ఇచ్చేందుకు ఏప్రిల్ 20న తమ ముందు హాజరు కావాలంటూ ఆదేశించింది. సైన్యం, వైమానిక దళాల ఉప దళాధిపతులు, రక్షణ శాఖ ఉన్నతాధికారులు, డీఆర్డీవో సహా రక్షణ వ్యవస్థకు చెందిన ప్రభుత్వరంగ సంస్థల ఉన్నతాధికారులతో సోమవారం జరిపిన ఆంతరంగిక సమావేశంలో, త్రివిధ దళాధిపతులను పిలిపించి, వారి వివరణ కోరాలని స్థాయీ సంఘం నిర్ణయించింది. స్థాయీ సంఘం సోమవారం జరిపిన సమావేశంలో రక్షణ శాఖ కార్యదర్శి సహా ఇతర ఉన్నతాధికారులు తాజా పరిస్థితులపై వివరణ ఇచ్చారు.

రెండు వైపులా యుద్ధం ముంచుకొస్తే ఇప్పటికిప్పుడు ఎదుర్కొనే పరిస్థితులు లేవని వారు చెప్పడంతో, ఈ అంశంపై త్రివిధ దళాధిపతుల నుంచే నేరుగా వివరణ కోరాలని స్థాయీ సంఘం నిర్ణయించింది. సైనిక బలగాలకు రేషన్ సరఫరాలో అవకతవకలపై ‘కాగ్’ నివేదిక విడుదలైన దరిమిలా, గత ఏడాది జనవరిలో పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) త్రివిధ దళాధిపతుల వివరణ కోరింది. ఆ తర్వాత ఒక పార్లమెంటరీ సంఘం త్రివిధ దళాధిపతులను పిలిపిస్తుండటం ఇదే మొదటిసారి. పైగా, బలగాల సన్నద్ధతపై వారి ని వివరణ కోరనుండటం స్వాతంత్య్రానంతర చరి త్రలో ఇదే తొలిసారి. ఆర్మీచీఫ్ వి.కె.సింగ్ ఇటీవల ప్రధానికి బలగాల సన్నద్ధతలోని డొల్లతనాన్ని బయటపెడుతూ లేఖ రాసిన సంగతి తెలిసిందే. 

No comments:

Post a Comment