2004 సునామీ జ్ఞాపకాలతో వణికిన 28 దేశాలు
సముద్ర మట్టానికి 33 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం
1800 కిలోమీటర్ల దూరంలోని భారత్‌ను తాకిన భూ ప్రకంపనలు
ఆస్ట్రేలియా, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్, సింగపూర్‌లలోనూ కంపనలు
రాష్ట్రంలో విశాఖ నుంచి నెల్లూరు దాకా కంపించిన భూమి..
మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు భయం.. భయం
ఎట్టకేలకు సాయంత్రానికి సునామీ లేదంటూ చల్లని కబురు చెప్పిన ప్రభుత్వం
భూకంప ప్రభావం నిలువుగా పైకి కాకుండా సమాంతరంగా విస్తరించడంతో తప్పిన సునామీ ముప్పు... ఎక్కడా నమోదు కాని ప్రాణనష్టం

సమయం మధ్యాహ్నం 2 గంటలు దాటింది.. బయట మండే ఎండ.. కాసేపటి కిందే భోజనం చేసిన జనం కాస్త కునుకేశారు.. ఆఫీసుల్లోనివాళ్లు పనిలో పడ్డారు. హఠాత్తుగా భూమి కంపించింది.. ఇళ్లల్లోని వస్తువులు, సామాన్లే కాదు.. గుండెలు సైతం కిందకు జారిపోయాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం రోడ్లమీదకు పరుగులు తీశారు. విశాఖ, విజయనగరం, నెల్లూరు, కాకినాడేకాదు.. హిందూ మహాసముద్ర తీరంలోని ఆస్ట్రేలియా, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేసియా, సింగపూర్‌లలో ప్రజలందరి పరిస్థితీ ఇదే! బుధవారం మధ్యాహ్నం ఇండోనేషియా సమీపంలో పుట్టిన భూకంపాల దెబ్బకు ఈ దేశాలకు ప్రకంపనలు పాకితే.. ఆ తరువాత సునామీ హెచ్చరికలు సుమారు 28 దేశాలను వణికించాయి. 2004 డిసెంబరులో సునామీ సృష్టించిన బీభత్స జ్ఞాపకాలు ఒక్కసారిగా జనం మదిలో మెదిలాయి. మళ్లీ ఆ భయంకర రాకాసి అలలు మీదకొస్తాయన్న భయంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోయారు. సునామీ ముప్పులేదని సాయంత్రానికి తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు.
No comments:
Post a Comment