Mar 26, 2012

నెలాఖరుకల్లా పెట్రోమోత!


పార్లమెంట్‌కు విరామం రావడమే ఆలస్యం
పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై రూ.2-5, గ్యాస్‌పై రూ.30-70
ఆమ్ ఆద్మీకి ఇక బతుకు గుదిబండే

న్యూఢిల్లీ, న్యూస్‌లైన్: దేశంలో ఆమ్ ఆద్మీ బాగు కోసం అహరహం కృషిచేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే కేంద్రంలోని యూపీఏ సర్కార్ అదే ఆమ్ ఆద్మీకి బతుకుబండిని లాగలేని భారీ గుదిబండగా మార్చనుంది. గతంలో మాదిరిగా పెంపు ఈసారి ఒకటిరెండు ఉత్పత్తులకు పరిమితం కాదని, పెట్రో ఉత్పత్తులన్నింటిపైనా ఈసారి వడ్డన ఉంటుందని తెలుస్తోంది. నెలాఖరులోగా ఈ పెట్రో బాంబు పేలడం తథ్యమని, ఆ మేరకు ఇప్పటికే అత్యున్నత స్థాయిలో నిర్ణయం జరిగిందని కేంద్రంలోని విశ్వసనీయ ఉన్నతస్థాయి వర్గాలు ‘న్యూస్‌లైన్’కు వెల్లడించాయి. అయితే ఈ నిర్ణయం అమల్లోకి ఎప్పుడొస్తుందనేదానిపైనే ఒకింత అస్పష్టత ఉందని, వచ్చే కేబినెట్ భేటీలో అదీ తొలగిపోతుందని చెప్పాయి. ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా ఇవి సాగుతుండగానే పెట్రో బాంబు పేల్చాలా లేక సమావేశాలకు బ్రేక్ పడిన వెంటనేనా అనేదానిపై సర్కార్ మల్లగుల్లాలు పడుతోందని తెలిపాయి. పార్లమెంటు జరుగుతుండగా ధరలు పెంచితే ఇప్పటికే సమస్యల సుడిలో చిక్కుకున్న సర్కార్‌పై అన్ని పార్టీలు మూకుమ్మడిగా దాడికి దిగుతాయని, దాన్ని ఎదుర్కోవడం కష్టమవుతుందని, ఈ దృష్ట్యా ప్రస్తుత సమావేశాలకు విరామం వచ్చిన వెంటనే పెంపును అమల్లోకి తేవడానికే మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నాయి. పార్లమెంటులో ఇతరత్రా అంశాలు రానున్న ఒకటిరెండు రోజుల్లో తీవ్ర చర్చనీయాంశమై ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టినట్టయితే వాటి నుంచి దృష్టి మళ్లించడానికి పార్లమెంటు జరుగుతుండగానే కూడా పెంపును ప్రకటించే అవకాశం లేకపోలేదని చెప్పాయి.

పెట్రోల్‌పై కనీసం రూ.5 తప్పదు...

అంతర్జాతీయ విపణిలో ముడిచమురు బ్యారెల్ ఇప్పుడు 125 డాలర్లు పలుకుతోంది. రైల్వే రవాణా చార్జీలు పెరగకముందు, ముడిచమురు ధర 110 డాలర్లు ఉన్నపుడు పెట్రోల్‌పై లీటర్‌కు రూ.3.50 నుంచి 4 వరకు నష్టం వచ్చేదని, కనీసం లీటర్‌కు రూ.5 ధర పెంచకపోతే కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయని తొలుత ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వీటి ప్రకారం... అప్పటికి ఆయిల్ కంపెనీలు భరిస్తున్న నష్టం లీటర్‌కు డీజిల్‌పై రూ.14.50, కిరోసిన్‌పై రూ.28.76 కాగా, వంటగ్యాస్ సిలిండర్‌పై (14.2 కిలోలు) రూ.388గా ఉంది. ఈ మూడు పెట్రో ఉత్పత్తుల సబ్సిడీల బిల్లు అంతకంతకూ పెరిగిపోతూ తమ ఆర్థిక స్థితిని తీవ్రంగా దెబ్బతీస్తోందని చమురు కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. పెట్రోల్ ధరను ఎంతలేదన్నా కనీసం రూ.5 పెంచాలని ప్రతిపాదించిన కంపెనీలు... రాజకీయంగా సర్కార్‌కు బాగా ఇబ్బందులు లేనిరీతిలో డీజిల్, కిరోసిన్, వంట గ్యాస్ ధరలను వీలున్నమేరకు పెంచేలా రెండుమూడు ప్రతిపాదనలు ఇచ్చాయి. డీజిల్ ధరను లీటర్‌కు రూ.2- 5వరకు, కిరోసిన్‌ను లీటర్‌కు రూ.2-6వరకు, వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.30-70 వరకు పెంచాలని ప్రతిపాదించినట్టు సమాచారం. సబ్సిడీల భారం పెరిగిన నేపథ్యంలో వీటిని ఆమోదించడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేదని, దేశవ్యాప్తంగా తీవ్రంగా వ్యతిరేకత వచ్చినా సరే ఈ పెంపుతో ముందుకెళ్లడం తప్పనిసరి అని కంపెనీల యాజమాన్యాలు ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చాయి. 

No comments:

Post a Comment