హైదరాబాద్, మేజర్ న్యూస్: దమ్మూ ధైర్యం ఉంటే తమపై అనర్హత వేటు వేయించాలని, బహిరంగంగా విప్‌ను ధిక్కరించిన తర్వాత మళ్ళీ భేటీలు, అభిప్రాయ సేకరణలు అవసరం లేదని నిన్న మొన్నటిదాక ఎంతో గట్టిగా మాట్లాడిన జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ పని జరిగే సరికి పైకి గాంభీర్యం నటిస్తున్నా, లోలోపల బిక్కుబిక్కు మంటున్నట్టు సమాచారం. అక్రమ ఆస్తుల కేసులో జగన్‌ను సీబీఐ ఏ నిముషంలోనైనా అరెస్టు చేయవచ్చుననే వదంతులు బలంగా షికారు చేస్తుండటంతో అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలలో ఆందోళన రోజు రోజుకూ పెరుగుతున్నట్టు తెలిసింది. వచ్చే నెల రెండు లోగా జగన్‌పై సీబీఐ చార్జిషీటు దాఖలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సీబీఐ ఆ పనిలో పూర్తిగా నిమగ్నమై ఉంది. ఈ నెలాఖరులోగానే చార్జిషీటును సిద్ధం చేసి నిర్ణీత గడువులోగా దాఖలు చేస్తామని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.అరెస్టు జరిగితే?
జగన్ అరెస్టు అంటూ జరిగితే ఆయన ఇక ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశాలుండవు. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఉప ఎన్నికలలో సత్తా చూపకపోతే 2014 నాటికి పార్టీ పరిస్థితి ఏమవుతుందో అన్న ఆందోళన ఒకవైపు, ఈ ఉప ఎన్నికలలో తమకు మద్దతుగా ప్రచారం చేసే దిక్కు కోల్పోతామన్న భయం...తాజా మాజీలను వెంటాడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వస్తున్న సమాచారం ప్రకారం మే మాసంలో దేశ వ్యాప్తంగా అన్ని ఉప ఎన్నికలూ ఒకేసారి జరగనున్నాయి. 16 మందిపై అనర్హత వేటు వేస్తున్నట్టు, ఒక ఎమ్మెల్యే రాజీనామా ఆమోదించినట్టు శాసనసభ స్పీకర్ కార్యాలయం నుంచి సోమవారం లేఖ వెళ్ళే అవకాశం ఉంది. జూన్‌లో రాష్టప్రతి ఎన్నికలో ఎమ్మెల్యేలు పాల్గొనేందుకు వీలుగా మే మాసంలో ఎన్నికలు పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తున్నది. ఈ నేపథ్యంలో ఇటు జగన్‌పై ఏప్రిల్‌లో చార్జిషీటు దాఖలు కాగానే సీబీఐ ఆయనను అరెస్టు చేస్తే ప్రచారం విషయంలో తాము రెక్కలు తెగిన పక్షులు కాక తప్పదన్న భయం జగన్ వర్గం మాజీలను కలవరపెడుతోంది.
విజయమ్మతో లాభం లేదు
జగన్‌ను అరెస్టు చేస్తే పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు గతంలో ప్రకటించాయి. అయితే జగన్ చేసే ప్రచారానికీ, విజయమ్మ ప్రచారానికీ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని మాజీలు భావిస్తున్నారు. దివంగత వైఎస్ పేరును జనంలోకి తీసుకెళ్ళటంలో జగన్ ఇప్పటికే పూర్తి పరిణతి సాధించారని, జనాన్ని ఆకర్షించే శక్తి సంపాదించారని, ఆయన కాకుండా విజయమ్మ ప్రచారానికి వెళ్తే ఆమెను చూడటానికి జనం వస్తారు తప్ప వారి వోట్లు తమ ఖాతాలో జమ అవుతాయో కావో చెప్పలేమని జగన్ వర్గం ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నట్టు తెలిసింది.
సానుభూతి నో గ్యారంటీ
జగన్‌ను అరెస్టు చేస్తే ఆ సానుభూతితో తమకు మరిన్ని వోట్లు వస్తాయని అనర్హత వేటు పడిన శ్రీకాంత్‌రెడ్డి లాంటి వారు చెప్పుకుంటున్నప్పటికీ ఆ గ్యారంటీ ఏమీ లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధికార పార్టీ అభ్యర్థుల అంగ, అర్థ బలాల ముందు, తెలుగుదేశం పార్టీ ప్రచార శక్తి ముందు తమ బలం నిలవలేదన్న భయం మాజీలను పట్టి వెంటాడుతున్నట్టు సమాచారం. జగన్‌ను అరెస్టు చేస్తే ఆ సానుభూతి ఏమీ పని చేయదని కాంగ్రెస్ ఇప్పటినుంచే ప్రచారం ప్రారంభించింది. ఆయన అరెస్టుతో ప్రపంచమేమీ తలకిందులు కాదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తనను కలిసిన ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ నేతలకు భరోసా ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి.
తొందర పడ్డామా?
జగన్ పంచన చేరి అనవసరంగా రెండు సంవత్సరాల పదవీకాలాన్ని దూరం చేసుకున్నామా అనే ఆత్మ విమర్శ సైతం మాజీలలో కొందరికి కలుగుతున్నట్టు తెలిసింది. అప్పట్లో జగన్ వర్గంలో చేరి ఆ తర్వాత కొంతకాలానికే కాంగ్రెస్‌లోకి తిరుగు టపా కట్టిన ఎమ్మెల్యేలు చక్కగా నియోజకవర్గం అభివృద్ధి నిధులు సాధించుకుని పనులు చేసుకుంటున్నారని, పనిలో పనిగా స్వంత పనులు చక్కబెట్టుకుంటున్నారని, తమ పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయిందని మాజీలు కొందరు భావిస్తున్నట్టు తెలిసింది. సీఎం పేషీలో తమను పట్టించుకునేవారు లేకపోగా నియోజకవర్గంలో ఏ ఒక్క పనీ చేయించుకోలేకపోయామని, మాజీమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తే తప్ప ఆయన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేస్తామన్న హామీ రాలేదని కొందరు ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గంలో పనులు చేయించకుండా, అభివృద్ధికి బాటలు వేయకుండా ఉప ఎన్నికల బరిలో దిగి ప్రచా
రానికి వెళ్తే జనం వేసే ప్రశ్నలకు జవాబు ఎలా చెప్పాలన్న ఆందోళన కూడా మాజీలను కలవరపెడు
తున్నట్టు తెలిసింది.
No comments:
Post a Comment