Feb 2, 2012

ప్రముఖ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య నిర్యాణం


(సూర్య వార్త)
ప్రముఖ నిర్మాత, నటుడు అట్లూరి పుండరీకాక్షయ్య (78) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పుండరీకాక్షయ్య గురువారం ఉదయం ఆరు గంటలకు తుదిశ్వాస విడిచారు. తెలుగులో 20, కన్నడలో ఆరు చిత్రాల్లో పుండరీకాక్షయ్య వివిధ పాత్రలు పోషించారు. ఆయన రచయితగా కూడా పని చేశారు. పుండరీకాక్షయ్య మృతి పట్లు తెలుగు, తమిళ చిత్రసీమ ప్రముఖలు సంతాపం తెలిపారు.

మహానటుడు ఎన్టీరామారావుతో కలిసి ‘నేషనల్‌ ఆర్ట్‌‌స థియేటర్‌’ స్థాపించి నాటకాలు వేసిన అనుభవం ఆయనది. ఆయన ప్రోత్సాహంతోనే మద్రాస్‌ వెళ్లి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌గా ఉంటూ అంచెలంచెలుగా నిర్మాతగా ఎదిగారు. మహామంత్రి తిమ్మరుసు, శ్రీకృష్ణావతారం, భలేతమ్ముడు, మనుషుల్లో దేవుడు, ఆరాధన వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మాంచారు. మధుర గాయకుడు మహ్మద్‌ రఫీ తెలుగువారికి బాగా దగ్గరయ్యింది పుండరీకాక్షయ్య చిత్రాల ద్వారానే. నిర్మాతగా చాలా సంవత్సరాలు ఆయన పేరు తెరవెనకే ఉన్నా విజయశాంతి నటించిన సూపర్‌హిట్‌ సినిమా ‘కర్తవ్యం’ సినిమాలో ముద్దుకృష్ణగా విలన్‌ పాత్రలో నటుడిగా తెరమీద తన విశ్వరూపం చూపించారు అట్లూరి పుండరీకాక్షయ్య.ఆ చిత్రంలో ఆయన తన శత్రువుని ఉద్దేశించి ‘నీ జీవితం మీద నాకు విరక్తి కలిగింది’ అంటూ చెప్పే డైలాగ్‌ ఆ చిత్రంలో బాగా సన్నివేశపరంగా పండింది. కృష్ణాజిల్లా కైకలూరు దగ్గర మొకాసా కలవపూడిలో ఆగస్టు 19, 1925 సంవత్సరంలో ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టారు ఆయన. ఆర్థికపరిస్థితులు అనుకూలించక 8వ తరగతితోనే చదువు ఆపేశారు. తండ్రితో కలిసి బియ్యం వ్యాపారం చేసేవారు. నాటకాల మీద వ్యామోహంతో చిన్నతనం నుంచి పద్యాలు అడిగినవాళ్లకు కాదనకుండా పాడి వినిపించేవారు పుండరీకాక్షయ్య. దూరపు బంధువు నిడుముక్కల సుబ్బారావుగారు పుండరీకాక్షయ్యను ఒక నాటకాల ట్రూప్‌లో చేర్పించారు. అక్కడే మహానటుడు రేలంగి వెంకట్రామయ్య పరిచయం అయ్యారు. రేలంగి రికమెండేషన్‌తో ‘ప్రహ్లాద’ అనే చిత్రంలో చండామార్కులవారి శిష్యులలో ఒకరిగా నటించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. బాంబుల భయంతో అక్కడినుండి బెజవాడకు తిరిగి వచ్చేశారు పుండరీకాక్షయ్య. ఎలాగో ఆ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసి తిరిగి నాటకాలు వేస్తుండేవారు. అలా ఉండేకాలంలో ఎన్‌.టి.రామారావుతో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి నేషనల్‌ ఆర్ట్‌‌స థియేటర్‌ స్థాపించి నాటకాలు వేసేవారు. ఆ తర్వాత రామారావు హీరోగా మారి బిజీగా ఉండేకాలంలో బెజవాడ ఎప్పుడు వచ్చినా పుండరీకాక్షయ్య ఇంట్లోనే దిగేవారు. రామారావు హీరోగా ఉండి బిజీగా ఉండటంతో పుండరీకాక్షయ్య రామారావు తమ్ముడు త్రివిక్రమరావుతో కలిసి నేషనల్‌ ఆర్ట్‌‌సను విజయవంతంగా కొనసాగించేవారు. ఆ తర్వాత రామారావు రికమెండేషన్‌తో విజయా సంస్థలో నెలకు వంద రూపాయల జీతంతో చక్రపాణిగారు పుండరీకాక్షయ్యకు అవకాశం ఇచ్చారు. రామారావుని పుండరీకాక్షయ్యగారు బావ అని సంభోదించేవారు. రామారావు తన తమ్ముడు నిర్మాతగా నేషనల్‌ ఆర్ట్‌‌స బ్యానర్‌పై ‘పిచ్చిపుల్లయ్య’ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌ బాధ్యతను పుండరీకాక్షయ్యకే అప్పగించారు. నిర్మాతగా పుండరీకాక్షయ్య తొలి చిత్రం ‘మహామంత్రి తిమ్మరుసు’. ఈ చిత్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రజత పతకం లభించింది. మహ్మద్‌ రఫీతో తొలిసారిగి ‘భలేతమ్ముడు’ చిత్రంలో పాటలు పాడించారు పుండరీకాక్షయ్య. ఆ తర్వాత ‘ఆరాధన’ చిత్రంలో కూడా పాడించారు. చాలా కాలం గ్యాప్‌ తర్వాత మళ్లీ విజయశాంతి నటించిన ‘కర్తవ్యం’ చిత్రంలో విలన్‌గా తెరపై కనిపించారు. ఆ చిత్రం తర్వాత వరసగా 20కి పైగా తెలుగు సినిమాలలో 5 కన్నడ చిత్రాలలో క్యారెక్టర్‌ యాక్టర్‌గా చేశారు. పుండరీకాక్షయ్యగారు భాస్కర చిత్ర బ్యానర్‌ కింద ‘మనుషుల్లో దేవుడు’, ‘ఆరాధన’, ‘మేలుకొలుపు’, ‘మావారి మంచితనం’, ‘లక్ష్మి’, ‘కురుక్షేత్రంలో సీత’, చివరిగా ‘రాఘవయ్యగారి అబ్బాయి’ చిత్రాలు తీశారు. ‘ఆరాధన’ చిత్రం తర్వాత ఆయన తీసిన చిత్రాలు అంతగా విజయవంతం కాలేదు. కాగా పుండరీకాక్షయ్యగారు తరచుగా ఎఎన్నాఆర్‌, ఎన్టీఆర్‌లతో కలిసి ‘నరనారాయణ అను శ్రీకృష్ణార్జునులు’ అనే చిత్రం తీయాలని చెబుతుండేవారు. అది తీరని కోరికగానే మిగిలిపోయింది. పుండరీకాక్షయ్యకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి.

No comments:

Post a Comment