Feb 16, 2012

మోగిన ఉప నగారా

ఉప ఎన్నికల నగారా మ్రోగింది. వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఒక పార్లమెంటు, 11 శాసనసభా స్థానాల్లో ఉప ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌(సిఇసి) షెడ్యూల్‌ జారీ చేసింది. ఇందులో ప్రస్తుతం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఏడు శాసనసభా నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, కోవూరు, స్టేషన్‌ఘన్‌పూర్‌, కొల్లాపూర్‌, అదిలాబాద్‌, కామారెడ్డి నియోజకవర్గాలు ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజేశ్వరరెడ్డి మృతితో మహబూబ్‌నగర్‌ ఖాళీ కాగా జగన్‌ వర్గంలో చేరిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌ రెడ్డి, తెలంగాణా రాష్ట్ర డిమాండ్‌తో నాగం జనార్ధన్‌ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహా ఇతర ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ స్థానాలతో పాటు మంసా(గుజరాత్‌), పిరవొమ్‌(కేరళ), శంకరన్‌ కొవిల్‌(తమిళనాడు), అతాగర్‌(ఒడిషా) శాసనసభా స్థానాలకు, ఉడుపి చిక్మగలూర్‌(కర్నాటక) పార్లమెంటు స్థానానికి ఎన్నికల షెడ్యూల్‌ వెలువడింది. ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ ఈ నెల 22న విడుదల కానుంది. ఫిబ్రవరి 22 నుంచి 29వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. మార్చి 18 న పోలింగ్‌ జరగనుంది. ఓట్ల లెక్కింపు 21న నిర్వహిస్తారు. కాగా ఉప ఎన్నికలు జరుగనున్న ఆయా స్థానాలకు సంబంధించిన జిల్లాల్లో ఎన్నికల నియమావళి వెంటనే అమల్లోకి వస్తుందని సిఇసి ఒక ప్రకటనలో తెలిపింది.కాగా జమ్మూకాశ్మీర్‌లో ఎమ్మెల్యేల కోటాలో శాసనమండలికి ఎన్నికైన యశ్‌పాల్‌ ఖజరియా మృతితో ఏర్పడిన ఖాళీ స్థానానికి ఇసి షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చి 22న ఆ స్థానానికి పోలింగ్‌ జరగనుంది.

No comments:

Post a Comment