(ప్రజాశక్తి వార్త)
మద్యం సిండికేట్ల వ్యవహారంలో తనను ఎవరూ బలిపశు వును చేయలేదని ఎక్సైజ్ శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. శుక్రవారం నాడాయన సిఎల్పీ కార్యాలయంలో న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, ఎమ్మెల్సీ మాకం రంగారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. తన సామాజిక వర్గానికి చెందిన మంత్రిని కాపాడుకోవడానికి మోపిదేవిని బలిపశు వును చేశారని సోనియాగాంధీకి డిఎల్ రాసిన లేఖపై ఆయన కౌంటర్ ఇచ్చారు. తనకు మద్దతుగా మాట్లాడిన డిఎల్‌కు కృతజ్ఞతలు చెబుతూ బిసిలను అణగదొక్కుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. మద్యం సిండికేట్ల విషయంలో తనపై కుట్ర జరిగిందని భావించడం లేదన్నారు. ఎసిబి రిపోర్టుకు రాజకీయం జోడించొద్దని, సిఎంపై చేసే విమర్శల్లోకి తనను లాగొద్దని డిఎల్‌కు సూచించారు. మద్యం సిండికేట్లపై త్వరలో నిజాలు బయటికొస్తాయన్నారు. తనపై వచ్చిన ఆరోపణల గురించి సిఎం వద్ద ప్రస్తావించానని, ఆయన విచారణకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎసిబి తన నుంచి కూడా వివరణ కోరాల్సి ఉందని, వివరణ తీసుకోకపోవడం తప్పేనన్నారు. ఏరాసు మాట్లాడుతూ విచారణలో అన్ని విషయాలూ తేలతాయన్నారు.
డబ్బు సంచులతో పదవులు రావు : హర్షకుమార్
పదవుల కోసం ఢిల్లీకి డబ్బు సంచులు మోస్తున్నారని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అనడం సరైంది కాదని ఎంపి హర్షకుమార్ తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. విమానం ఎక్కడానికి కూడా డబ్బుల్లేని నందిఎల్లయ్య, ఎంఎ ఖాన్, రత్నాబాయిలను అధిష్టానం గుర్తించి పదవులు కట్టబెట్టిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. సమన్వయ సంఘంలో మాలలకు, కేంద్రమంత్రివర్గంలో మాదిగలకు చోటు కల్పిస్తే బాగుంటుందని చెప్పారు. మద్యం వ్యవహారంలో వాస్తవాలు బయటకు రావాలన్నారు. మద్యం సిండికేట్లపై ఎసిబి రిపోర్టును బయటపెట్టాలంటున్న జగన్ సిబిఐ విచారణను ఎందుకు తప్పుపడుతున్నారో అర్థం కావడం లేదని తెలిపారు.
No comments:
Post a Comment