(సూర్య వార్త)
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఒక పక్క సీబీఐ విచారణ జోరుగా సాగుతూండగా, ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ (ఇడి) మాత్రం చాపకింద నీరులా తన పనితాను చేసుకుపోతోంది. ఇప్పటికే జగన్ ఆస్తులకు సంబంధించి ఆయనకు చెందిన కంపెనీలలో సునామీలా వచ్చిపడిన నిధుల ఉప్పెన గురించి కూలంకషంగా వివరాలు సేకరించిన ఇడి.. ఇక జగన్‌ను అరెస్ట్ చేసేందుకే రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అత్యంత విస్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మార్చి రెండో వారంలో జగన్ మోహన్ రెడ్డిని ఇడి అరెస్ట్ చేసేఅవకాశాలున్నాయని తెలిసింది. ముఖ్యంగా జగన్ కంపెనీలలో పెట్టుబడులు, విదే శీ నిధుల మళ్లింపు, ఫెరా, ఫెమా చట్ట ఉల్లంఘనలకు సంబంధించి సమగ్ర సాక్ష్యాధారాలతో సిద్దంగా ఉండాలంటూ ఈ వ్యవహారంపై విచారణ జరుపుతున్న అధికారులను ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆదేశించడం ఈ అరెస్ట్ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ విచారణ ప్రారంభించడానికి కొద్దిరోజుల ముందే ఎన్ఫోర్సెమెంట్ డైరక్టరేట్ కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అదే సమయంలో ఆదాయపన్ను విభాగం కూడా రంగంలోకి దిగింది.
దీంతో పాటుగా దేశంలోని పరిశ్రమలు, కంపెనీలకు వచ్చే విదేశీ నిధులు, పెట్టుబడులపై నిరంతరం నిఘా ఉంచే రెవెన్యూ ఇంటిలిజెన్స్ విభాగం కూడా దర్యాప్తు చేపట్టింది. గత ఆరు నెలలుగా ఈ విభాగాలు చేపట్టిన దర్యాప్తులో జగ న్ గ్రూప్ కంపెనీలలో పెట్టుబడుల విషయంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని నిర్దారణకు వచ్చింది. ముఖ్యంగా విదేశీమారక ద్రవ్య పరిమితులు, విదేశీ కంపెనీలనుంచి పెట్టుబడులు స్వీకరించే పద్దతులలో జగన్ గ్రూప్ అనేక అవకతవకలకు పాల్పడినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. దీంతో ఇప్పటికే ఈ విచారణలో బాగంగా జగన్‌తో పాటు ఆయన ప్రతినిధులను పలుమార్లు విచారించిన సీబీఐ ఇక ఫైనల్‌గా జగన్‌ను మరోమారు విచారించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
ఇందుకోసం మార్చి మొదటివారంలో నోటీసు ఇవ్వనున్నట్లు ఢఫిల్లీ అధికారుల సమాచారం. అయితే విచారణకు పిలిపించిన సమయంలోనే జగన్‌ను అరెస్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయని బలంగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఇప్పటికే అన్నిరకాల లిఖితపూర్వక ఆధారాలు (డాక్యుమెంటిరీ ఎవిడెన్స్) సేకరించిందని, ఇక చర్యలు మాత్రమే మిగిలి ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. మరో పక్క జగన్ కంపెనీలలో పెట్టుబడులకు సంబంధించి విదేశాలకు వెళ్లి విచారించేందుకు సీబీఐ కోర్టునుంచి అనుమతి కూడా పొందడంతో తమవద్ద ఉన్న ఆధారాలతో జగన్‌పై చర్యలు తీసుకోవాలని ఇడి అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశిస్తూ రెండు మూడు రోజుల్లో ఢిల్లీలోని ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ నుంచి జగన్‌కు నోటీసులు జారీ అయ్యే అవకాశాలున్నాయని కొందరు అధికారులంటున్నారు. ‘జగన్ ఆస్తుల కేసులో మాపని మేం చేస్తున్నాం, వాళ్ళపని (ఇడి) వారు చేస్తున్నారు. మాకు అందిన సమాచారం వారికి అందించాం. వారి సమాచారాన్ని మాకు ఇచ్చారు. మాకందిన ఆధారాలను బట్టి మేం చర్యలు తీసుకుంటున్నాం...వాళ్లేం చేస్తారో మాకు చెప్పి చేయరుకదా’ అని సీబీఐ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
కాగా, భద్రతా కారణాలు, రాజకీయ కారణాల దృష్ట్యా జగన్‌ను తీహార్ జైలుకు తరలించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు అటు జగన్ శిబిరం కూడా మానసికంగా సిద్ధంగానే ఉండటం ప్రస్తావనార్హం. ‘ జగనన్న తనను ఈడీ అరెస్టు చేస్తుందని చాలారోజుల నుంచే చెబుతున్నారు. దానికి అంతా సిద్ధంగానే ఉన్నాం. ఆయన అరెస్టు తర్వాత సానుభూతి వెల్లువెత్తుతుంద’ని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

No comments:
Post a Comment