Feb 17, 2012

అంచనాలకు చేరని నిప్పు (రివ్యూ)


(సాక్షి వార్త)


తారాగణం: రవితేజ, దీక్షాసేథ్, రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, భావన...
దర్శకత్వం: గుణశేఖర్ 
నిర్మాత: వైవీఎస్ చౌదరి

కథ: అతని పేరు సూర్య... పేరుకు తగ్గట్టే ‘నిప్పు’లాంటి కుర్రాడు. భయం అనేది అతని నిఘంటువులో లేదు. సూర్యకు తల్లిదండ్రులు లేరు. అంతా ఫ్రెండ్సే. కొన్ని పరిస్థితుల కారణంగా నగరంలో కబ్జాకోరుగా పేరెన్నికగన్న రాజాగౌడ్‌తో సూర్య తలపడాల్సి వస్తుంది. దాంతో ఎలాగైనా సూర్యాని చంపాలని చూస్తుంటాడు రాజాగౌడ్. ఇదిలావుంటే... ఫ్రెండ్ శ్రీరామ్‌ని కలవడానికి సౌదీ వెళతాడు సూర్య. అక్కడ తనకు షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. శ్రీరామ్ ప్రేయసి వైష్ణవి ప్రమాదవశత్తూ చనిపోతుంది. కానీ అది ప్రమాదం కాదని, శ్రీరామే హత్య చేశాడని సౌదీ పోలీసులు శ్రీరామ్ కోసం వెతుకుతుంటారు. 

ఈ విషయం తెలిసి సూర్య షాక్ అవుతాడు. సూర్య సమక్షంలోనే శ్రీరామ్ సౌదీ పోలీసులకు పట్టుబడతాడు. తనకు సౌదీ న్యాయస్థానం మరణ శిక్ష విధిస్తుంది. శ్రీరామ్‌కి క్షమాభిక్ష లభించాలంటే... సౌదీ న్యాయశాస్త్రం ప్రకారం వైష్ణవి తల్లిదండ్రుల సంతకాలతో కూడిన క్షపాపణ పత్రం కోర్టులో సబ్‌మిట్ చేయాలి. ఈ విషయం తెలుసుకున్న సూర్య... వైష్ణవి తల్లిదండ్రుల సంతకాల కోసం మళ్లీ హైదరాబాద్ వస్తాడు. అక్కడ తెలుస్తుంది తనకు అసలు విషయం. వైష్ణవి తండ్రి ఎవరో కాదు... తనను బద్ధశత్రువుగా భావిస్తున్న రాజాగౌడ్. రాజాగౌడ్ ఒప్పించి సూర్య ఎలా సంతకం తీసుకున్నాడు? తన ప్రాణ మిత్రుడ్ని ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ: కథలో కొత్తదనం ఉన్నా.. కథనం అందుకు అనుగుణంగా సాగలేదు. గుణశేఖర్ సినిమా అంటే.. సాంకేతికంగా కొన్ని అంచనాలుంటాయి. కానీ ఇందులో అంత స్థాయి లేదు. తమన్ సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. రవితేజ నటన తన గత చిత్రాల ట్రాక్‌లో సాగింది. ముఖ్యంగా బ్రహ్మానందం, రవితేజ కాంబినేషన్‌లో వచ్చే కామెడీ సన్నివేశాలు మరింత మెరుగ్గా ఉండవచ్చు. గ్లామర్ పరంగా దీక్షాసేథ్ సినిమాకి ఉపయోగపడింది. 

రాజేంద్రప్రసాద్ స్థాయికి ఆయన వేసిన పాత్రను తీర్చి దిద్దలేదు. సౌదీలో తీసిన లొకేషన్లు మాత్రం కొత్తగా అనిపిస్తాయి. మేకింగ్ పరంగా వైవీఎస్ ఖర్చు బాగానే పెట్టారు. అయితే అది సార్థకత కాకుండా పోయింది. సొగసుచూడతరమా, మనోహరం, చూడాలని ఉంది, ఒక్కడు లాంటి చక్కని చిత్రాలకు దర్శకుడైన గుణశేఖర్ నుంచి ఇలాంటి సినిమాను ఊహించలేం అన్నది సత్యం.

No comments:

Post a Comment