(ఆంధ్రజ్యోతి వార్త)
మేడారం, ఫిబ్రవరి 9 : సమ్మక్క తల్లి వనం నుంచి జనంలోకి వచ్చింది. గు రువారం రాత్రి 7.44 గంటలకు మేడారం గద్దె కు చేరుకున్నది. ఆ తల్లిని గద్దెకు తోడ్కొని వచ్చే పూజ తంతు ఉదయం నుంచే మొదలైంది. తొలుత వడ్డెలు, గిరిజన పూజారులు చిలుకలగుట్ట మార్గంలోనే వనం (వెదురు) పూజ చేశారు. అనంతరం ఈ వెదురును మేడారంలోని సమ్మక్కను ప్రతిష్ఠించే గద్దెపైకి తీసుకువచ్చారు. తర్వాత పూజారులంతా మేడారానికి వెళ్లి సమ్మక్క గుడిలో వడేరాలకు(మట్టి పటువలు) పూజలు చేశారు.
సమ్మక్క గుర్తులను వీటిలో ఉంచారు. తర్వాత వాటిని మేడారం గద్దె వద్దకు తీసుకువచ్చి మళ్లీ సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం మూడింటికి సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి తోడ్కొని వచ్చే తంతు మొదలైంది. గిరిజన వంశపారంపర్య పూజారులు చిలుకలగుట్టకు చేరుకున్నారు. గుట్టపై సమ్మక్క దేవత వేంచేసి ఉన్నచోట ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను, ఆమె గుర్తులను వెదురు బుట్టలో పెట్టి, ఎర్రని వస్త్రం కప్పి కిందకు తీసుకొచ్చారు. అక్కడ వేచి ఉన్న ఎస్పీ రాజేశ్‌కుమార్.. సమ్మక్క గుట్ట దిగుతున్న సంకేతంగా ఏకే-47తో గాలిలో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు.
కలెక్టర్ రాహుల్ బొజ్జా కూడా గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. డప్పు చప్పుళ్లు, డోలు వాద్యాల నడుమ.. సమ్మక్కను పూజారులు గద్దెకు తోడ్కొని వచ్చారు. ఆ దృశ్యాన్ని వీక్షించేందుకే అక్కడికి చేరుకున్న భక్తులు దారిపొడవునా బారులు తీరారు. "జై సమ్మక్క తల్లీ'' అనే నినాదాలతో.. శివసత్తుల పూనకాలతో చిలుకలగుట్ట దారి మారుమోగిపోయింది. సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించిన తర్వాత తొలిపూజ చేసి, దర్శనానికి భక్తులకు అనుమతించారు. శనివారం సాయంత్రం తల్లుల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. కాగా.. మేడారం జాతర ఏర్పాట్లు బాగున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేది కలెక్టర్, ఎస్పీలను అభినందించారు.
గురువారం సతీసమేతంగా మేడారం వచ్చిన ఆయన.. సమ్మక్క-సారలమ్మలకు మొక్కులు సమర్పించారు. తులాభారం తూగి నిలువెత్తు బంగారాన్ని (90 కిలోలు) తల్లులకు సమర్పించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా జాతరకు గురువారం విచ్చేసి సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకున్నారు. తులాభారంలో ఆయన 48కేజీలు తూగారు. కాగా, కేసీఆర్ మొక్కులు చెల్లించుకుంటున్న సమయంలో.. భక్తులు విసిరిన బెల్లం ముక్క ఒకటి గాలిలో ఎగిరి అనూహ్యంగా ఆయన తలకు తగిలింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన తలకు హెల్మెట్ పెట్టారు. .

.jpg)
No comments:
Post a Comment