Feb 18, 2012

యూపీ నాలుగో విడత నేడే 11 జిల్లాల్లోని 56 స్థానాలకు పోలింగ్

సాక్షి వార్త 

బరిలో నిలిచిన 967 మంది అభ్యర్థులు
సోనియాకు సవాలుగా మారిన ఎన్నికలు

లక్నో: ఉత్తరప్రదేశ్ నాలుగో విడత అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 11 జిల్లాల్లోని 56 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. ముగ్గురు మంత్రులు, 32 మంది ఎమ్మెల్యేలు, 12 మంది మాజీ మంత్రులు సహా మొత్తం 967 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 1.74 కోట్ల మందికి పైగా ఓటర్లు తేల్చనున్నారు. హర్దోయ్, ఉన్నావో, లక్నో, రాయ్‌బరేలీ, ఫరూఖాబాద్, సీఎస్‌ఎం నగర్, కన్నౌజ్, బాందా, చిత్రకూట్, ఫతేపూర్, ప్రతాప్‌గఢ్ జిల్లాల్లో నాలుగో విడత ఎన్నికలు జరగనున్నాయి. 

కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బచ్రావన్, హర్‌చాంద్‌పూర్, రాయ్‌బరేలీ సదర్, సరేనీ, ఊంచాహార్ అసెంబ్లీ స్థానాలకు ఈ విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ పార్టీ అభ్యర్థుల కోసం సోనియాతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ప్రచారం చేశారు. 

2007 అసెంబ్లీ ఎన్నికల్లో రాయ్‌బరేలీ సదర్‌లో స్వతంత్ర అభ్యర్థి గెలవగా.. మిగతా నాలుగు చోట్లా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇదిలావుంటే, నాలుగో విడతలో చాలా మంది ప్రముఖులు బరిలో నిలిచారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు కల్‌రాజ్ మిశ్రా తొలిసారి ఎన్నికల రణంలోకి దిగుతున్నారు. లక్నో తూర్పు స్థానం నుంచి ఆయన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 

లక్నో కంటోన్మెంట్ నుంచి యూపీసీసీ చీఫ్ రీటా బహుగుణ జోషి పోటీ చేస్తున్నారు. కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్ భార్య లూయిస్ ఖుర్షీద్(ఫరూఖాబాద్ సదర్ స్థానం) భవితవ్యమూ ఈ దశలోనే తేలిపోనుంది. ఈ విడతలో 103 మంది నేరచరితులు, 139 మంది కోటీశ్వరులు పోటీ చేస్తుండటం గమనార్హం.

No comments:

Post a Comment