Jun 16, 2011

మనుషులపై ప్రయోగాలు! ఫార్మా కంపెనీల దారుణం..


ఈ రోజు ఆంధ్ర జ్యోతిలో వచ్చిన వార్త ఇది:
ప్రయోగశాలల్లో గినియా పిగ్స్, ఎలుకల మీద ప్రయోగించాల్సిన మందుల్ని... మురికివాడల్లో బీదాబిక్కీతో తినిపించాయి కొన్ని ఫార్మాకంపెనీలు. అదేమీ తెలియని అమాయక జనం... సొమ్ము కోసం ఆశపడ్డారు. మంచి చేస్తాయో చెడుచేస్తాయో... అసలు ప్రాణాలే తీస్తాయో తెలియని మందుల్ని పరగడుపునే మింగి బాధను భరించారు. బ్లడ్‌టెస్టుల కోసం అని బొంకిన బ్రోకర్లు 18సార్లు రక్తం తీసుకున్నా సహించారు. ఇప్పుడా మందులు వికటించాయి. ఒంట్లో రక్తం తరిగిపోయింది. గుండెదడ, ఆయాసం, ఆకలి లేకపోవడం... మొత్తమ్మీద అంతుపట్టని అనారోగ్యం కబళిస్తుంటే ఏంచేయాలో దిక్కుతోచక అల్లాడుతున్నారు! గుంటూరు జిల్లా పల్నాడులో వెలుగుచూసిన ఘోరమిది!

ఆన్‌లైన్, పిడుగురాళ్ల, జూన్ 16 : కొత్తగా తయారుచేసే మందులను... అవెంత మేరకు పనిచేస్తాయో తెలుసుకునేందుకు ముందుగా ప్రయోగశాలల్లో గినియా పిగ్స్, ఎలుకల మీద ప్రయోగిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రక్రియే. కానీ... మన రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు రెండు మూడడుగులు ముందుకేసేశాయి. ప్రయోగాల కోసం ఏకంగా మనుషులనే లక్ష్యంగా చేసుకున్నాయి. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కేంద్రంగా ఫార్మా కంపెనీలు చేసిన దారుణాలివి. ఆదర్శనగర్ కాలనీలో అత్యంత దుర్భర జీవితం గడుపుతున్న పేదలపై హైదరాబాద్‌కు చెందిన కొన్ని ఫార్మా కంపెనీలు కన్నేశాయి.

తాము తయారుచేస్తున్న మందులను మింగితే వేలకొద్దీ డబ్బులిస్తామని వాటివల్ల ఎటువంటి హానీ కలగదని బ్రోకర్లను రంగంలోకి దించి ప్రచారం చేశాయి. ఈ ప్రచారానికి ఆకర్షితురాలైన షేక్ జమీలా ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి వారు తయారుచేసిన మందులను మింగించారు. మూడు దఫాలుగా మందులు మింగించి... ముందు మాట్లాడుకున్నట్లుగా ఒక్కోదఫాకు రూ.3 వేలు చొప్పున చెల్లించినట్లు తెలుస్తోంది. అదే కాలనీలో నివాసముంటున్న మోదుగుల సుశీల(40), కొమ్ము కరుణమ్మ(45), చిన్నమ్మాయి(60), ఎస్.కె. బేబి(70), శావా సువార్త(60), ఐలా ధనలక్ష్మి(32)లతో పాటు మరికొందరు పురుషులు కూడా ఫార్మా కంపెనీల ప్రయోగాలకు వెళ్లివచ్చారు.

రానుపోను ఖర్చులతో పాటు ఒక్కొక్కరికి రోజుకు రూ.200 చొప్పున చెల్లించారు. ప్రయోగాలకు వీరి ఆరోగ్యం సహకరిస్తుందని తేలిన తరువాత ఒక్కొక్కరికి హైదరాబాదు వెళ్లిన ప్రతిసారీ (మొత్తం మూడుసార్లు) రూ.మూడేసి వేలు చొప్పున చెల్లించారు. మొదట్లో అంతా బాగానే ఉన్నప్పటికీ... ప్రయోగాల కోసం హైదరాబాదు వెళ్లివచ్చిన ఆదర్శనగర్ కాలనీవాసులు క్రమేపీ అనారోగ్యానికి లోనవడంతో ఈ దారుణం వెలుగుచూసింది. మోదుగుల సుశీలతో పాటు మరికొందరు బాధితుల వంటికి నీరు రావటం, గుండెదడ, ఆయాసం, ఆకలి లేకపోవటం, తీవ్రమైన ఒళ్లునొప్పులు వంటి సమస్యలు తలెత్తాయి. స్థానికులు ఈ విషయాన్ని మీడియా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మరికొన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

* డబ్బిచ్చి ప్రయోగాల కోసం పేదలను హైదరాబాదు తీసుకెళ్లిన కంపెనీలు అక్కడ వారికి నరకం చూపించాయి. పర్యవేక్షణ పేరుతో బాధితులతో పరగడుపునే నానారకాల మందులు మింగించినట్లు తెలుస్తోంది.
* పరీక్షల కోసమని ఒక్కొక్కరి నుండి ఒకేనెలలో 18 సార్లు రక్తం సేకరించినట్లు బాధితులు చెబుతున్నారు.
* నెలసరిలో ఉన్న మహిళల వద్ద నుండి సైతం ఇదేవిధంగా రక్తాన్ని సేకరించారని సమాచారం. దీంతో బాధితులు పూర్తిగా నీరసించి మంచాన పడ్డారు.

అంతా గుట్టు!
ప్రయోగాల వ్యవహారాన్ని కంపెనీలు రహస్యంగా నడిపించాయి. బాధితులను ఎక్కడకు తీసుకెళ్లేది, ఎక్కడ వుంచేది బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బాధితులు చెబుతున్న దానిప్రకారం మియాపూర్‌లోని విమలాల్యాబ్‌తో పాటు, చర్లపల్లిలోని రహస్య ప్రాంతంలో పరీక్షలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఇదే కాలనీకి చెందిన మరికొందరు మహిళలను పిల్లలను కనిచ్చేందుకు(సర్రొగేట్ మదర్స్) రూ.2 లక్షలు ఇస్తామని సంతాన సాఫల్య కేంద్రాలకు తీసుకెళ్లినట్లు తెలుస్తున్నది.
Read more ...