Sep 23, 2011

జన్ లోక్‌పాల్ ఉంటే చిదంబరం జైల్లో: అన్నా హజారే


ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్త ఇది:
ముంబై/రాలేగావ్‌సిద్ధి: ఇప్పుడుగనుక జన్ లోక్‌పాల్ చట్టం ఉండి ఉంటే కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం జైల్లో ఊచలు లెక్కిస్తూ ఉండేవారని అవినీతి వ్యతిరేక ఉద్యమ నేత అన్నా హజారే చెప్పారు. 2జీ కుంభకోణంలో చిదంబరం పాత్రపై తాజా వివాదం నేపథ్యంలో శుక్రవారం తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో అన్నా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కుంభకోణంలో ఆయన ఇంటికి వెళ్లాల్సిందేనని.. గతంలో చిదంబరాన్ని ‘ఖోడ్సాల్’ (ఈ మరాఠీ పదానికి దుష్టుడు లేదా నిజాయితీలేని వ్యక్తి అనే అర్థాలున్నాయి)గా అభివర్ణించిన హజారే అన్నారు. జన్ లోక్‌పాల్ విషయమై దీక్ష అనంతరం స్వగ్రామానికి తిరిగి వచ్చినప్పుడు ఢిల్లీలో తన అరెస్టు, విడుదలపై మాట్లాడుతూ చిదంబరాన్ని ‘ఖోడ్సాల్’ అంటూ ఆయన ధ్వజమెత్తారు. 2జీ విషయంలో ప్రధానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ రాసిన లేఖ వెలుగుచూసిన నేపథ్యంలో ప్రతిపక్షాలు ముక్తకంఠంతో హోం మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ప్రధానికి హజారే లేఖ: దేశంలో ఎన్నికల సంస్కరణలు సహా ఇతర కీలక అంశాలకు సంబంధించి ప్రధాని మన్మోహన్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలపాలని కోరుతూ అన్నా హజారే ఆయనకు లేఖ రాశారు. ‘మన ప్రజాస్వామ్య, రాజకీయ వ్యవస్థలు ఎదుర్కొంటున్న పలు సవాళ్లపై ప్రధాని అభిప్రాయం ఏమిటో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. రీకాల్ హక్కు, తిరస్కరణ హక్కు సహా ఇతర అంశాలపై ఆయన అభిప్రాయాన్ని స్పష్టం చేయాలని కోరాను’ అని హజారే తెలిపారు. ఇదిలాఉండగా, ఎన్నికల సంస్కరణలపై ప్రచారం చేపట్టనున్నట్టు చెప్పారు. పటిష్ట లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తల నియామకానికి మద్దతివ్వాలని కోరుతూ మహారాష్ట్రలోని సర్పంచ్‌లకు, గ్రామ పంచాయతీ సభ్యులకు లేఖ రాయనున్నట్టు పేర్కొన్నారు.

1 comment:

  1. చిదంబరాన్ని ఎట్టి పరిస్థితులలోనూ చెరసాలలో పెట్టరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్‌లని అణచివెయ్యడానికి చిదంబరం అవసరమనుకుంటోంది. ఒరిస్సాలోని మావోయిస్ట్‌లు వేదాంత రిసోర్సెస్ అనే బహుళజాతి కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. చిదంబరం భార్య వేదాంత రిసోర్సెస్ కంపెనీ పార్ట్నర్. చిదంబరం తన భార్య ప్రయోజనాల కోసమైనా మావోయిస్ట్‌లని అణచివేస్తాడని అనుకునే కేంద్ర ప్రభుత్వం చిదంబరానికి హోమ్ మంత్రి పదవి ఇచ్చింది. గతంలో పశ్చిమ బెంగాల్‌లో మావోయిస్ట్‌లని తీవ్రంగా అణచివేసిన సిద్ధార్థ శంకర రేకి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర మంత్రి పదవి ఇచ్చి అతన్ని రాజకీయంగా పైకి తెచ్చింది. అలాంటి కాంగ్రెస్ పార్టీ చిదంబరాన్ని త్యజిస్తుందని అనుకోలేము.

    ReplyDelete