ఈ రోజు సూర్య దిన పత్రికలో వచ్చిన వార్త ఇది:
పుట్టపర్తి సత్యసాయి బాబా అనారోగ్యం బారిన పడి 11 రోజులవుతోంది. 11వ రోజు సాయంత్రం డాక్టర్ల ప్రకటనతో పది రోజుల ఉత్కంఠకు తెర పడినట్టనిపించింది. గురువారం సాంయత్రం బాబా ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపిస్తోందంటూ ఒక ప్రకటనలో డాక్టర్లు పేర్కొన్నారు. ఐసీయులోనే కొనసాగుతు న్నప్పటికీ షుగర్, బిపి లెవల్స్ కంట్రోల్‌లోకి వచ్చాయని వారు ఆ ప్రకటనలో తెలిపారు. సిఆర్‌ఆర్‌టి పరికరం ద్వారా డయాలసిస్ చేస్తున్నామని, మూత్రపిండాలు స్వత:సిద్ధంగా పనిచేస్తున్నాయని తెలిపారు. సత్యసాయి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.బాబా ఆరోగ్యం మెరుగుపడుతోం దన్న సమాచారం తెలిసిన తరువాత భక్తుల్లో ఆనందం వెల్లివిరు స్తోంది. బాబా అనారోగ్యానికి గురైనప్పటి నుంచీ ప్రశాంతి నిలయంలో భజనలు, కీర్తనలు జరుగుతున్నప్పటికీ పుట్టపర్తి మాత్రం మూగబోయింది. పుట్టపర్తిలో ఏ ఒక్కరిని కదిలించినా బాబాతో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుని బాధ పడేవారు. ఇలా పుట్టపర్తిలో విషాదఛాయలు అలుముకున్నాయి.దీనికితోడు పరిస్థితి తీవ్రతను గమనించి పోలీసులు ఆంక్షలు విధించడంతో దుకా ణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. బస్సులు తిరగడంలేదు. గురువారం డాక్టర్ల ప్రకటనతో పుట్టపర్తిలో కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతున్నాయి. విషయం తెలిసిన తరువాత పోలీసులు ఆంక్షలను సడలించారు. యథావిధిగా బస్సులు నడుస్తున్నాయి. దుకాణాలు తెరుచు కున్నాయి.
సత్యసాయి ఆరోగ్యం మెరుగుపడుతోందన్న సమాచారం తెలిసిన తరువాత పుట్టపర్తిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా మూడు సమయాల్లో సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు బాబా ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు ఓ బులెటెన్‌ను విడుదల చేసేవారు. గురువారం ఉదయం పంపిన బులెటిన్‌లో బాబా ఆరోగ్యం నిన్నటిలాగే ఉందన్న సమాచారం పంపారు. సాయంత్రం పంపిన బులెటిన్‌లో సత్యసాయి ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపిస్తోందంటూ ప్రకటన విడుదల చేశారు.మూత్రపిండాలు స్వత:సిద్ధంగా పనిచేయడం శుభపరిణామమని, బిపి, షుగర్ లెవల్స్ కంట్రోల్‌లోకి వచ్చాయని పేర్కొన్నారు. బాబా పూర్తిగా కోలుకునేంత వరకూ ఐసీయులోనే ఉంటారని తెలిపారు. అంతవరకూ ఐసీయులోకి ఎవరినీ అనుమతించమని ప్రకటనలో పేర్కొన్నారు. బాబా ఆరోగ్యం మెరుగుపడుతోందన్న సమాచారం తెలుసుకున్న తరువాత జిల్లావ్యాప్తంగా భక్తులు పూజలు, కీర్తనలు చేయడం మొదలుపెట్టారు. బాబా లేకున్నా గడచిన పదిరోజుల నుంచీ ప్రశాంతి నిలయంలో యథావిధిగానే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఉదయం, సాయంత్రం భజనలు, కీర్తనలు, పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. బాబా కోలుకుంటున్నాడన్న సమాచారం తెలుసుకున్న తరువాత పుట్టపర్తి వాసుల్లో సంతోషం పెల్లుబుకుతోంది. పుట్టపర్తిలో పలువురు భక్తులు మీడియాతో మాట్లాడుతూ.. బాబా సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి వస్తాడన్న నమ్మకం తమకుందని తెలిపారు. గురువారం బాబా కోలుకుంటున్నాడన్న డాక్టర్ల ప్రకటనతో పది రోజుల ఉత్కంఠకు తెర పడినట్లయింది.

No comments:
Post a Comment